Saturday 19 April 2014

Sutras : 72 & 73



72వ సూత్రం:- నాస్తి తేషు జాతి విద్యారూపకుల ధనక్రియాది భేదః  
          ఇటువంటి ఉత్తమ భక్తులలో కుల, మత, రూప, విద్య, ధనం, వృత్తి మొదలైన వాటిలో వ్యత్యాసాల వల్ల కలిగే ఏ భేదాలు ఉండవు. వీరు అందరిలోను ఆ పరమాత్మను తప్ప అన్యం ఏమీ చూడరు. ఇటువంటి భేదభావాలన్నీ మనమే మన మనసులలో సృష్టించుకోవడం వలన అవి నిజాన్ని మరుగుపరుస్తాయి.
          మనం లౌకిక విషయాలలో శరీర-మనో-బుద్ధి స్థాయిలో స్పందించడమే దీనికి కారణం. ఇవి మనలో పరిచ్ఛిన్నభావాన్ని కలుగచేస్తాయనడంలో సందేహం లేదు. అందువల్లనే ముందుగా మన దృష్టి కోణం మారాలి.
ఆధ్యాత్మికతలో గుణానికి, కర్మకే ప్రాధాన్యం కాని, భేదభావానికి తావే లేదు. ఈ సత్యాన్ని మనమందరం గ్రహించాలనే సదుద్దేశంతో మాత్రమే వారు మన వద్దకు వస్తారు.
ఉత్తమ భక్తులు ఈ స్థాయిని దాటి ముందుకు సాగుతారు. కాబట్టి వారిలో సత్యాన్ని గురించిన అపోహలు, ఎటువంటి భేదభావాలు ఉండవు. వారు అందరిలోనూ భగవత్ స్వరూపాన్ని దర్శించగలరు. శాస్త్రం కూడా ఇటువంటి భేదాల్ని ఒప్పుకోలేదు.
 ఉదా శబరి, భక్త కన్నప్ప, తుకారాం, తులసీదాస్, మాల పిచ్చమ్మ మొదలైన వారు ఈ కోవకి చెందిన భక్తులు.
ఒక సాధకుడిగా ఈ సూత్రం నుండి నేర్చుకోవలసినది, నాలో ఉన్న అహంకారాన్ని వదిలి, పరమాత్మ కోసమే పనులు చేయడంలో నిమగ్నమవ్వాలి. ఎటువంటి భేదభావాలు లేకుండా అందరితో కలసి పని చేయడం వలన, అన్నీ సక్రమంగా జరుగుతాయి.
ఈ ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకే రకంగా ఉండరు, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ప్రజ్ఞ (టాలెంట్) ఉంటుంది. దానిని గుర్తించి, వారినుండి నేర్చుకోగలిగే ప్రయత్నం చేయాలి కాని వారిలో చెడును వెదుకుతూ పోకూడదు. అటువంటపుడే  మనం అందర్నీ ప్రేమగా, సమానంగా చూడగలిగి, జీవితంలో ఉన్నత స్థితికి చేరగలుగుతాము.
          ప్రేమ, ద్వేషం ఒకే చోట ఉండలేవు. నేను అందర్నీ ప్రేమగా చూడలేక పోతున్నాను అనుకున్నప్పుడు, దాని కోసమైన భక్తిని నెరపాలి.
          మనకు ఏదైనా (వస్తువు) కావాలనుకున్నప్పుడు, దాని కోసమై కష్టపడతాం. మరి, నాలోనే ఉన్న ఆ పరమాత్మకై ప్రయత్నిస్తే ఆయన తప్పక వస్తాడు. (మనం కావాలనుకున్న దానిని (కోరుకున్నది) సాధించుకోడానికి చేసే ప్రయత్నం, మనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకోడానికి చేస్తే, ఆయన తప్పకుండా మనకు చేరువౌతాడు.)
          నా హృదయంలోనే ఉన్న పరమాత్మకోసం సిగ్గువిడిచి నృత్యం, పాడడం చేయగలగాలి. యోగుల హృదయాలలోనే కాదు, నా భక్తులు నన్ను కీర్తించిన చోటే నేను నివసిస్తాను, అని ఆ పరమాత్మే స్వయంగా చెప్పాడు. నేను ఉత్తమ భక్తునిగా మారాలి అనుకుంటే, ఎల్లవేళలా ఆ పరమాత్మను నామనసులో నిలుపుకోగలుగుతున్నానా, లేదా నా మనసు అన్య విషయాలవైపు మరలుతోందా అనేది ఎప్పుడూ పరిశీలించుకుంటూ ఉండాలి.
          మనం ఫలాపేక్ష లేకుండా కర్మను ఆచరించడం వల్ల, అది మనకు స్ఫూర్తినివ్వడమే కాక, చిత్తశుద్ధిని కలిగిస్తుంది. భక్తి మన వ్యక్తిత్వాన్ని ప్రేమ మయం చేస్తుంది. జ్ఞానం మనకు సత్యాన్ని తెలియచేస్తుంది. ఈ బంధాలన్నిటినుండి బయట పడగలిగినపుడే మనకు ముక్తి సాధ్యమౌతుంది. భేదాలన్నింటిని వదలి, అందరినీ ఒకే విధంగా ఎలా చూడగలము, అని ఇంకా మనకు సందేహం ఉన్నట్లయితే దానిని గూర్చి నారదుల వారు తర్వాతి సూత్రంలో విశదీకరించారు. కర్మలో చిన్న, పెద్ద తేడాలు, శ్రేష్ఠ, కనిష్ఠాలు ఉండవు. ఎందుకంటే...
73వ సూత్రం:- యతస్తదీయాః
          అటువంటి ఉత్తమ భక్తులందరూ భగవంతుని స్వరూపమై ఉన్నారు కాబట్టి, వారికి భేదాలు కనిపించవు. అందరూ భగవత్స్వరూపమేనని వారికి తెలుస్తుంది. ఉదా నా చేతికి ఉన్న ఐదు వేళ్ళు నాకు సమానమే. ఎందుకంటే అవి అన్నీ నా శరీరానికి సంబంధించినవే కాబట్టి, ఏ ఒక్కటి ఎక్కువా కాదు, తక్కువా కాదు.
అదే రకంగా ఉత్తమ భక్తులకు దేనిలోను భేదం కానరాదు. వారు ఆచరించే మార్గాలు వేరైనా, గమ్యం ఒకటే. అట్టి అత్యున్నత స్థాయిని చేరనివారికే వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఉత్తమ భక్తుని మనసు భగవదాకారం దాల్చి, వారి వ్యవహారం కూడా అన్యమైన ఆలోచనలు లేకుండా పరమాత్మతో నిండి ఉంటుంది. అటువంటి వారు ప్రతిక్షణం భగవద్రసాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.
          కాబట్టి వారిలో ఎవరు గొప్ప భక్తుడు? అన్న ప్రశ్న వారికి రానే రాదు. ఈ ప్రశ్న జనించేది ఇంకా పరిపక్వత నొందని వారిలోనే.

Saturday 5 April 2014

Sutras: 67 & 68



67వ సూత్రం:-భక్తా ఏకాన్తినో ముఖ్యాః
భక్తులలో రెండు రకాలుంటారు. మొదటి రకానికి చెందిన భక్తులు భగవంతునితో పూర్తిగా తాదాత్మ్యం చెంది, ఏ బంధాలు లేకుండా నిర్మలంగా ఉంటూ, ఏ విధమైన కోరికలు లేకుండా ఉంటారు. రెండవ రకానికి చెందిన వారు తమ సాధన ద్వారా భక్తిని పెంపొందించుకొని ఉన్నత శ్రేణి భక్తులుగా మారతారు.
          నారదులవారు మహాభక్తుని గూర్చి చెపుతున్నారు. ఏకాన్తినః- ఆ పరమాత్మయే ఏకైక లక్ష్యంగా (గమ్యంగా) కలిగిన వాడే సర్వోత్తమమైన భక్తుడు. అన్య చింతన లేకుండా అతని సర్వశక్తులూ పరమాత్మ కోసమే వినియోగిస్తాడు. అతని హృదయంలో ఆ పరమాత్మపై ప్రేమ తప్ప, ఇంకేమి ఉండదు. మనో బుద్ధుల పరంగా కూడా పరమాత్మతో ఒక్కటై, భక్తి విశ్వాసాలు కలిగి ఉంటాడు. భగవంతునితో ఐక్యం కావడమే అతని జీవిత పరమావధి.
ఉదా ఒక సంత్‍మహరాజ్ ఇల్లు మంటల్లో కాలిపోతూ ఉంటుంది. అందరూ వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా, ఆయన వద్దని వారిస్తాడు. వారంతా అయోమయంలో పడి ఆయన ఎందుకు ఆగమన్నాడో అని ఆగుతారు. కొంతసేపటికి మంటల ఉధృతి తగ్గగా, సంత్‍మహరాజ్, తానే స్వయంగా మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తాడు, అప్పుడు అందరూ ఆయనను, మా అందర్నీ వారించి ఇప్పుడు మీరెందుకు మంటలనార్పడానికి ప్రయత్నిస్తున్నారు? అని అడుగగా, ఆయన, అప్పుడు భగవంతుని నిర్ణయం ప్రకారం కాలాలని ఉంది, కనుక మిమ్మల్ని ఆపడం ద్వారా దానికి సహకరించాను. ఇప్పుడు మంటల ఉధృతి తగ్గి ఆరడం మొదలైంది. కాబట్టి, పరమాత్మ నిర్ణయం ప్రకారం ఆయనకు సహకరించాలనుకుంటున్నాను అన్నారు. తరిగొండ వేంగమాంబ, మీరాబాయి మొదలైనవారు ఈ కోవకి చెందిన భక్తులు.
ఇటువంటి భక్తుని వల్ల ముల్లోకాలు ఆనందిస్తాయి. రతి, గతి, క్రియ, ప్రియ మొదలైన
వాటన్నింటిలోనూ ఒక్కటిగా ఉన్నవాడు, తన స్వంతం అనేది ఏదీ లేకుండా ఉంటాడు. తనకు నియంత, రక్షకుడు, స్వామి అన్నీ ఆ పరమాత్మే అనుకొని, హృదయంలో ఆయనతో విడదీయరాని బంధం కలిగి ఉంటాడు. అటువంటి భక్తుడు ఆ పరమాత్మ తప్ప నాకు ఎవరూ లేరు, నేను ఆయనకు మాత్రమే చెందుతాను, ఆయన నా వాడు అని భావిస్తూ, భక్తి మార్గంలో ఇంకా ఎదిగిన కొద్దీ నీవు నేను ఒకటే, నా కన్నా నీవు అన్యం కాదు, అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. ఇటువంటి వారు మోక్షకాంక్ష కూడా లేకుండా, నిరంతర ఆత్మ సాక్షాత్కారంతో జీవిస్తూ ఉంటారు.
          అటువంటి మహాభక్తుల యొక్క ప్రవర్తన, మనస్థితి, వారి గొప్పతనం ఎలా ఉంటుందో తర్వాతి సూత్రం (68) ద్వారా తెలుసుకుందాము.
68వ సూత్రం:- కణ్ఠావరోధరోమాంచాశ్రుభిః పరస్పరం లపమానాః, పావయన్తి కులాని పృధివీంచ
మహాభక్తులైన వారు భావోద్వేగంతో కూడిన కంఠస్వరంతో, వినీవినిపించనట్లుగా మాట్లాడుతూ, శరీరాలు పులకించి, రోమాంచమై, అశ్రుధారలు కారుస్తూ, రసానుభూతిలో ఒకరితో ఒకరు వారి ఇష్ట దైవం గురించి ముచ్చటించుకుంటారు. అటువంటి భక్తుల కలయిక మధురంగా  ఉంటుంది. వారి భావాలను మాటలలో వ్యక్తం చేయలేరు. ఆ సమయంలో వారి స్వంత వ్యక్తిత్వం మాయమై, దైవాన్ని మాత్రమే వారిలో నిలుపుతుంది. వారి దృష్టి అన్యంగా దేనిమీదికి పోక, నిశ్శబ్దంలో కూడా ఆ బ్రహ్మానందానుభూతిని మాత్రమే ఆస్వాదిస్తుంటారు. ఇటువంటి వారి వలన భూలోకం మొత్తం పావనమౌతుంది. ఉదా రామకృష్ణ పరమహంస
ఇటువంటి వారి సామీప్యంలో ఉంటేనే ఆ అనుభూతి దానంతట అదే కలుగుతుంది.
వారి ఉనికి వలన వారి కుటుంబాలకు, కులానికి కీర్తి ప్రతిష్ఠలు లభించడమే కాక, భూమాత కూడా పవిత్రం అవుతుంది. అట్టివారు పరిపూర్ణ హృదయులు.
అహాన్ని మూలంతో సహా నశింపచేసి, బ్రహ్మానుభూతిని పొందిన అటువంటి మహాత్ములు ఉండడం ఈ భువికి గొప్పవరం. పరమాత్మను గూర్చి బోధిస్తున్నప్పుడు ప్రేమ తప్ప, వేరే ఏ విధమైన భావన వారిలో కానరాదు. ఒక్కొక్కసారి తనకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనా వాటిని లెక్కచేయక, తాను ఏమి చేస్తున్నా ఆ నారాయణుడి కోసమే అనే భావంతో ముందుకు సాగుతాడు. భగవత్సాక్షాత్కారాన్ని పొందిన ఇటువంటి భక్తులలో అందరి పట్ల సోదరభావం నెలకొని ఉంటుంది. శ్రేష్ఠత భక్తిలో కాని కులంలో కాదు.
          మనం ఇంకా సాధకుని స్థాయిలోనే ఉన్నాం కాబట్టి, ఇటువంటి భక్తులలో బేధాలు ఉంటాయా! అనే సందేహం కలుగవచ్చు. దీనికి సమాధానంగా తదుపరి సూత్రం (72) ఇవ్వబడింది.

Friday 21 March 2014

Sutras : 66 & 71



66వ సూత్రం:- త్రిరూపభంగ పూర్వకం, నిత్యదాస, నిత్యకాంతాభజనాత్మకం ప్రేమకార్యం ప్రేమైవ కార్యమ్
          సాధారణంగా సాధకునిలో ఉండే త్రిగుణాత్మకమైన (సత్వం, రజస్సు, తమస్సు) భక్తిని దాటి, ఎప్పుడూ దాసునిలా, ధర్మపత్నిలా సేవిస్తూ, ప్రేమను మాత్రమే అందరికీ పంచే విధంగా తన భక్తిని పెంపొందించుకోవాలి.
          ఈ రకమైన భగవద్భక్తిలో సాధకుని మార్గం, గమ్యం కూడా ఒకటే అయి, చివరికి కర్త, కర్మ, క్రియ అనే తేడా లేనటువంటి ప్రశాంతమైన మనః స్థితికి చేరుకుంటాడు. ఇదే పూర్ణానుభూతిని పొందిన మోక్షస్థితి.
          అటువంటి ఉత్కృష్టమైన భక్తిని నెరపడానికి, నిత్యదాస - ఒక సేవకుడు తన యజమానిని ఎంత గౌరవ, విశ్వాసాలతో సేవిస్తాడో, నిత్యకాంత - అంటే భార్య భర్తను విశ్వాస గౌరవాలతో మాత్రమే కాక, అతడిని స్వంతంగా భావించి సమర్పణా భావంతో, ప్రేమను అందించగలుగుతుందో, అదే విధంగా, పూర్ణమైన అంకితభావంతో, తన కర్తవ్యాన్ని వదిలివేయకుండా ప్రేమతో పరమాత్మ దరి చేరాలి.
          సేవకునికి ఈ రెండు ప్రత్యేక లక్షణాలు (ప్రేమ, సమర్పణభావం) ఉండనవసరం లేదు. కొందరు శ్రద్ధా, విశ్వాసాలతో సేవిస్తే, మరికొందరు వాటితో పాటు ఇది నా స్వంతం, నేను, వారు వేరు కాదు, ఒక్కటే అనే తాదాత్మ్య భావంతో సేవిస్తారు.
          ప్రేమ ఉన్నచోట, విస్మరణకు తావు లేదు. ఇటువంటి భక్తిలో రూపం తొలగిపోయి, పరమాత్మ-నేను వేరు కాదు, ఒక్కటే అన్న భావం కనిపిస్తుంది.
          కాని సాధకుడు ఆ పూర్ణస్థితిని చేరలేదు కనుక ఈ అరిషడ్వర్గాల వల్ల విస్మరణ అనేది సంభవిస్తూ ఉంటుంది. మనసును పరమాత్మ వైపు మరల్చడం ద్వారా పరిశుద్ధం చేయవచ్చు. అదే వేరే వస్తువుల వైపు మళ్ళితే మలినం అవుతుంది. మన మనసులో.
భావనను పరమాత్మవైపు మళ్ళించగలిగితే, ఆయనే మన దరికి వస్తాడు. అందులో ఆయనకు ఎటువంటి తేడాలు ఉండవు. ఎటువంటి పరిస్థితులలోనూ పరమాత్మను విస్మరించకుండా, ఉంటూ, మనలో ఉన్న అభిమానం, అహంకారం వంటి గుణాల్ని కూడా ఆయన వైపు మళ్ళించాలి. అభిమానం ఉన్నచోట ఆలోచనలు సంకుచితమై, ఒకే రూపం, సేవ, ఇదంటేనే ప్రేమ అనే భావం ఉంటే పరమ్నాత్మ దానిని తొలగిస్తాడు.
          సేవకి రూపంతో సంబంధం లేదు. అలా ఉన్నట్లయితే అది ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి చేసినదే అవుతుంది. ప్రేమలో గిరి గీసుకుని కూర్చోవటం ఉండదు. నేను ఈ పనే చేస్తాను, ఇంతే చేస్తాను; అది నా బాధ్యత కాదు, వారు పని చేయలేదు నేనెందుకు వారి పని చేయాలి? అలా ఉంటే మనకి అభిమానం ఉన్నట్లే. అభిమానం ఉన్న చోట ప్రేమకు తావు లేదు.
          పరమాత్మను పై రెండు విధాలుగా (ప్రేమ, సేవ) ఎలా సేవించినప్పటికీ, ముఖ్యంగా పరమాత్మకు, నీకు మధ్య దూరం ఉండకూడదు. సాధించాల్సినదల్లా ప్రేమ ఏవ కార్యం. పరమాత్మతో ప్రేమను నెరపాలి. అదే ఉత్కృష్ట స్థాయి.
          కాని, మొదట ప్రేమ ఎలా జనిస్తుంది? అనే సందేహం మనకు కలుగుతుంది. కారణం లేనిదే కార్యము ఉత్పన్నమవదు. కనుక మనలో ప్రేమ ఉత్పన్నమవడానికి మనకు వారిపట్ల గుణమహాత్మ్యా జ్ఞానం (గుణగణాలు, మహాత్మ్యం తెలియాలి), సంబంధ జ్ఞానం (వారితో ప్రత్యేకమైన సంబంధం ఏర్పరచుకోగలిగి ఉండటం), సేవా జ్ఞానం (ఇది సేవ రూపంలో ఉంటుంది) కలిగి ఉండాలి.
          ఏ పని చేస్తే పరమాత్మ (అవతలివారు) ప్రసన్నమౌతాడో అదే ప్రేమ. భజన కూడా రసాస్వాదన చేస్తూ చేయాలి. రసాస్వాదనకు పరిధులు లేవు.
          ఈ విధంగా ఇప్పటి వరకు చూచిన సూత్రాల రూపంలో భక్తిని గూర్చి నారదులవారు మనందరికీ చాలా చక్కగా విశదపరచారు. ఇంతటితో భక్తి ప్రకరణం సమాప్తమైంది. ఇప్పటివరకు భక్తి యొక్క పరాకాష్ఠ చూశాము. భక్తికి ప్రేమయే అత్యుత్తమమైన మార్గమని తెలిసింది.
భక్త ప్రకరణం
          ఉత్తమ భక్తుని యొక్క మాహాత్మ్యాన్ని తెలియ చేసేదే ఈ భక్త ప్రకరణం. అతడిని స్థిత ప్రజ్ఞుడిగా, జ్ఞానిగా అభివర్ణించవచ్చు. ఇప్పుడు ఉత్తమ భక్తుడంటే ఎవరో, నేను ఎందుకు భక్తుడు కావాలో అన్నది తెలుసుకుందాము.
          ఉత్తమ భక్తునిలో భక్తి; ప్రేమ, సేవల రూపంలో ఉపాధుల ద్వారా వ్యక్తమౌతుంది. ప్రేమ, సేవ కూడా ఆయన సహజ లక్షణాలే. వారు వాక్ రూపంలో అందరిలో ఉన్న పరమాత్మను పూజిస్తూ ప్రేమిస్తారు, స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం సేవయే.
పరమాత్మను ఎందుకు ప్రేమించాలంటే, అది (ప్రేమ) తన సహజ స్వరూపం కనుక.
          భక్తిలో తిరస్కార భావం ఉండదు. ఉత్తమ భక్తుని సేవకు ఎప్పుడూ సంతృప్తి అనేది ఉండదు. అటువంటి ఉత్తమ భక్తులను, వారి శారీరిక, మానసిక స్థితి, వారి లక్షణాలను గూర్చి, వారి సాధన ఏ విధంగా ఉంటుందో, ప్రేమ వారి నుండి ఎలా వ్యక్తమౌతుందో, వీటన్నిటినీతెలిపేదే ఈ భక్త ప్రకరణం.
71 సూత్రం:- మోదంతే పితరౌ నృత్యంతి దేవతాః
సనాధా చేయం భూర్భవతి
          భక్తిని సంపూర్ణంగా మనసులో నింపుకున్న భక్తుల వల్ల వారి పితృదేవతలు సంతృప్తి చెందుతారు. దేవతలు సంతుష్టులై నృత్యం చేస్తారు. మన సంస్కృతి, సంప్రదాయాలను రక్షించేవాడిగా ఉండడం వల్ల భూమాత కూడా చాలా ఆనందిస్తుంది.
          భక్తితో హృదయం ఉప్పొంగే స్థితికి భక్తుడు చేరినప్పుడు, దేహం ఆనంద పారవశ్యంతో రోమాంచమై, మాటలురాని అనుభూతితో ఆనందాశ్రువులు స్రవించే స్థితిని పొందుతాడు. ఇటువంటి భక్తులు తమ భక్తి ప్రాబల్యంతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తారు.
          అటువంటి వ్యక్తికి ముందు, వెనుక ఉన్న ఏడు తరాల వారందరూ తృప్తి పొందుతారు. ఆధ్యాత్మిక జీవనం గడపడానికి శ్రద్ధతో ప్రయత్నించిన సాధకులు, గతించిన మహర్షుల కృషి, త్యాగాల ఫలితంగా, ఈ ఉత్తమ భక్తుడు సత్యాన్ని గ్రహించగలిగాడని వారందరు సంతోషిస్తారు. ఉత్తమ భక్తుడిని ఏ ఋణాలు అంటుకోవు.
ఇక్కడ దేవతాః అంటే సత్పురుషులు అని అర్థం. అంటే వివిధ రూపాలలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపాలే, మన శరీరంలో అధిష్ఠాన దేవతల రూపంలొ ఉంటారు. అద్భుతం జరిగినప్పుడు దేవతలు నృత్యం చేస్తారు. ఉదాహరణకి కంటికి అధిష్ఠాన దైవం సూర్యుడు. ఉత్తమ భక్తుని కంటి ద్వారా ఆ పరమాత్మ దర్శనం కలగడం వల్ల, సూర్యుడు సంతృప్తి నొందుతాడు.
          భూఃఅంటే భూదేవి, విష్ణుసతి. ఆమె తనమీద నివసించే మనుషుల స్వార్ధం వల్ల కళావిహీనంగా ఉంటుంది. ఆమెకు సంరక్షకుడు లభించినప్పుడు, ఇక మీదట ఆమె భర్తృహీన కాదు, విధవ కాదు, సనాథ అవుతుంది. ఉత్తమ భక్తుడు ఉన్న చోట భగవంతుడు ఉండడం వలన భూదేవి తన దేవుడు మళ్ళీ లభించడంతో చాలా సంతోషిస్తుంది. ఉత్తమ భక్తుడు తన జ్ఞానం, చైతన్యంతో పరిసరాలను ప్రభావితం చేస్తాడు. తన ధర్మ ప్రవర్తనతో, అధర్మాన్ని నిర్మూలించి మానవత్వాన్ని  పునరుద్ధరిస్తాడు.
          ఆత్మసాక్షాత్కారం పొందిన భక్తుని వలన తన పితరులందరికీ హృదయ పరివర్తన కలిగి, తరిస్తారు.
          ఇటువంటి ఉత్తమ భక్తులు పరమాత్మ మహాత్మ్యాన్ని ఆనందంగా గానం చేస్తూ, తన పరిసరాలలోని మనుషులను ప్రభావితం చేస్తారు. ఉ ప్రహ్లాదుని కారణంగా అతని 7 తరాలు తరించేలా లక్ష్మీనరసింహుడు వరమిచ్చాడు.
          వీరి స్వరూపం ఎలా ఉంటుందో, సర్వోత్తమమైన భక్తుడు ఎవరో రాబోయే (67) సూత్రంలో తెలుసుకుందాం.