Monday 30 December 2013

Narada Bhakti Sutras : Sutra - 1



నారద భక్తి సూత్రాలు


ఈ భక్తిరస సూత్రాలు దేవర్షి నారదుల ద్వారా ప్రవచింపబడినవి. నారద భక్తి సూత్రాలు భక్తి తత్వం గురించి వివరించే ఒక ప్రామాణిక గ్రంథము. ఈ భక్తి సూత్రాలు మనందరికీ అసలు భక్తి అంటే ఏమిటో, భక్తి అనే సాధన ద్వారా ఏ రకంగా మనం పరమాత్మను చేరుకోగలమో అనేది 84 సూత్రాల రూపంలో చెబుతుంది. సూత్రం అంటే సంక్షిప్త రూపంలో ఉండి, అర్థం మొత్తాన్ని వివరంగా విశదపరచేది. ఇది సులువుగా గుర్తుపెట్టుకోవచ్చును. నారద - నారం ద్యతి ఖండయతి, కలహేన ఖండయతి- కలహం ద్వారా అహంకారాన్ని ఖండించేవాడు;  నారం - ఆధ్యాత్మ విషయ జ్ఞానాన్ని, ఆత్మ గురించి తెలిపి, స్వస్వరూపాన్ని తెలియజేసేవాడు (ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేవాడు).
భక్తి అనేది మనసు ద్వారా ఆస్వాదించేది. మన భావనయే భగవంతుడు. మనలో ఉన్న శక్తి ఎక్స్‍పాన్డ్‍డ టు పొటెన్షియల్. అదే పరమాత్మ. ఏ విధముగా సముద్రములోని అల తాను సముద్రమవ్వాలని కొరుకుంటుందో అదే విధముగా ఆ స్థితికి చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండాలి.
జీవుడిలో కోరిక మొదట విత్తనము రూపం‍లో స్థూలంగా ఉండటం వల్ల దేహాభిమానం చేత స్థూలంగా ఉన్న వాటినే కోరుకుంటాము. కొంత పరిణతి చెందిన తర్వాత కొంత సూక్ష్మత్వం పొందడం వల్ల వృక్షరూపంగా మారడం వల్ల అప్పుడది ప్రేమరూపంలో వ్యక్తమవడం వలన మనసు మనసుని కోరుకోవడం జరుగుతుంది. ఇంకా పరిణతి చెంది సూక్ష్మాతి సూక్ష్మంగా మారినప్పుడు మనలో ఉన్న అసీమిత శక్తి పూర్ణమైన పరమ ప్రేమ తత్వంగా మార్పు చెందడం వల్ల, ఈ స్థితిలో ఆత్మ, ఆత్మనే కోరుకుంటుంది. ఆత్మగా మిగులుతుంది.
జ్ఞానమనే పండు యొక్క రసమే భక్తి. ప్రేమ రెండు రకాలు. 1) ఆసక్తి 2) భక్తి. వస్తువులయందు ఉండేది ఆసక్తి. అయితే పరమాత్మయందు ఉండేది భక్తి. భక్తి

వలన మనం పరమాత్మను చేరుకోగలం. భక్తి వల్ల రాగ ద్వేషాలు, మాయా- మోహాలు, అవిద్య తొలిగింపబడతాయి. భక్తిలో భగవంతుడు తప్ప అన్యభావం ఉండదు.
భక్తి రెండు రకాలు. 1) పరాభక్తి, 2) అపరాభక్తి. అపరాభక్తి మరల రెండు రకాలు. 1) గౌణ భక్తి, 2) ముఖ్య భక్తి.
గౌణ(సెకండరి) భక్తి అంటే జప, తప, శాస్త్రాధ్యాయనం, ఉపవాసం మొదలగునది. ముఖ్య(ప్రైమరి) భక్తి అంటే పరమాత్మయందు పూర్ణ ఆసక్తి ఏర్పడడం. భావంతో కూడుకున్నటువంటిది. ఇది చేస్తూ ఉండగా, పరాభక్తిగా మారుతుంది.
పరాభక్తి అంటే భగవంతుని యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం. ఇది అనుభవ పూర్వకం. అహంకార మమకారాలు, రాగద్వేషాలు అన్ని తొలగిపోతాయి. పరమాత్మని సాకారంగా గాని, నిరాకారంగాని ఎలా ఆరాధించినా చేరుకోగలరు. ఫలితంగా పరిపూర్ణ శాంతి, పరమానందం కలుగుతాయి. ఏ విధమైన మార్గాన్ననుసరించినా (భక్తి, కర్మ, జ్ఞాన) చిత్తశుద్ధి కలిగి పరమాత్మను చేరుకోగలము. భక్తి, జ్ఞాన కర్మ యోగాలలో మూడూ ఆచరించడం వలన త్వరగా పరమాత్మను చేరుకోగలుగుతాము. భక్తి, ప్రేమ రెండింటిలోనూ భక్తే గొప్పది. ప్రేమ ఉంటేగాని భక్తి కలుగదు. అందుచేత భక్తిలో ప్రేమ కూడ ఆంతర్లీనంగా ఉంటుంది. భక్తి అనేది అందరిలోనూ ఎంతో కొంత ఉంటుంది. దీనికేమి ప్రత్యేకమైన అధికారత్వ లక్షణాలు అక్కర్లేదు. భక్తి మార్గంలో పయనించడం ద్వారా మిగతావన్నీ సహజంగా వస్తాయి. (జ్ఞానం, చిత్తశుద్ధి..)
ఒకటవ సూత్రం:- అథాతో భక్తిం వ్యాఖ్యా స్యామః
అథ = ఇప్పుడు; అతః = అందువలన; భక్తిం = భక్తిని గూర్చి; వ్యాఖ్యాస్యామః = విశదీకరిస్తున్నాం.
ఇప్పుడు అంటే ప్రాధమికమైన అధికారత్వ లక్షణాలు వచ్చిన పిమ్మట. అవి తపన, శ్రద్ధ, శక్తి. నిజమైన సాధకునకు అర్హత ఉన్నా, ఇంకా తృప్తి ఉండదు కనుక సాధనకు అవసరమైన మరికొన్ని లక్షణాలను అలవరచుకోవాలి. అవి వివేకం, విముఖ, అభ్యాసం, క్రియ, కల్యాణ, అనవసాద, అనుర్ధరస. అథః అంటే వీటిల్లో కొన్నైనా అలవరచుకున్న పిదప అని అర్ధం. ముముక్షువుకి మోక్షానుభూతి పొందేవరకు తృప్తి ఉండదు. కనుక, ఈ ప్రయోజనం కొరకు దైవ భక్తిని అలవరచుకోవాలి.
ఇప్పుడు భక్తిని విశదీకరిస్తున్నాము (భక్తిం వ్యాఖ్యాస్యామః). ఇక్కడ మేము అనే పదాన్ని వాడడం ద్వారా, తన గురువులందరికీ కృతజ్ఞతా పూర్వక ప్రణామాలు చేస్తున్న భావంతో అని. నారదుల వారు తన స్వానుభవాన్ని సమన్వయపరచి మనకి ఇస్తున్నారు. భక్తి వల్ల సకల బంధనాలనించి విముక్తి కలిగి, భగవద్దర్శనం కావిస్తుంది. జ్ఞాన మార్గంలో ఉన్న వారికైతే ధృఢత్వం వస్తుంది. ఇది అందరికీ లభ్యమయ్యేది. ఇది అన్నిటి కన్నా శ్రేష్ఠమైనది. పరమాత్మ గురించి తెలిపేది.
భక్తి యొక్క మాహత్మ్యంని తేలుపుతున్నారు.

No comments:

Post a Comment