Monday 17 February 2014

Sutra : 83



కాంతాసక్తి:- భగవంతుణ్ని తన ప్రియునిగా ఆరాధించే భక్తునికి ఆయనతో ఉన్న బాంధవ్యమే కాంతాసక్తి. ఈ రకమైన ఆసక్తిలో పరమాత్మయే పరమపురుషుడు, భోక్త. ఇది పరిపూర్ణమే కాక ధర్మప్రధానమైనది. కామాసక్తి ఎంత మాత్రము కాదు. పరమాత్మ చెంతనే ఉన్నా, లేకపోయినా ఆ భేదమేమి తెలియదు. ఉ కుబ్జు, శ్రీకృష్ణుని అష్టభార్యలు, రాధ, ఆండాళ్, గోపికలు మొదలైనవారు ఈ రకపు భక్తులు.
ఆత్మనివేదనాసక్తి:- తనను తాను పరిపూర్ణంగా భగవంతుని పాదాల వద్ద సమర్పించుకోవడం, ఆయన కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడడమే
          సంపూర్ణ సమర్పణమంటే నేను, నాది అనే భావాన్ని త్యజించి, నా ఇంద్రియాలు, శరీరం, మనస్సు, బుద్ధి, సర్వం నీవే (పరమాత్మ), సర్వాధికారము నీకే అని తలంచడమే కాక, తనలోని అభిరుచులూ, కోరికలు, విలాసాలు, భోగాలన్నీ త్యాగం చేసి, నీవే నా అభిరుచి అనే భావనతో జీవించడం.
    మనం పూజలు చేసేటపుడు సమర్పించే దక్షిణ కు అసలైన అర్థం నన్ను నేను అన్నింటినీ త్యజించి సంపూర్ణశరణాగతి పొందిన భక్తులకు పరమాత్మే శాశ్వతంగా తన పరమౌతాడు. అటువంటి భక్తుల సాన్నిధ్యంలో జీవించినా సకల పాపాలు నశించి శాంతి లభిస్తుంది. శీరామచంద్రునిపై హనుమకు గల భక్తి అటువంటిదే.
తన్మయతాసక్తి:- మనసు పూర్తిగా పరమాత్మ వశమై, తాను ఆయనలో లీనమయ్యే మరొక భక్తిమార్గం తన్మయాసక్తి. తాను, భగవంతుడు ఒకటే అనే అనుభూతిని పొందడానికి నిరంతరం కృషి చేయడమే ఈ భక్తి మార్గపు సారంశము. ఈ స్థితిలో భక్తునికీ, భగవంతునికి మధ్య వ్యత్యాసం ఉండదు. సనత్కుమారులు, యజ్ఞవాల్క్యుడు మొదలైన మహాయోగులు ఈ మార్గంలో పయనించారు.
పరమ విరహాసక్తి:- పరమాత్మను విడిచి దూరంగా ఉండలేని ప్రేమే విరహాసక్తి. భక్తులు, పరమాత్మ తమ వద్ద లేడని వ్యాకులత చెంది, పరితపిస్తూ విరహబాధ అనుభవిస్తారు. శ్రీకృష్ణుడు బృందావనాన్ని విడిచి వెళ్ళినప్పుడు గోపికల వేదన ఇటువంటిదే.
          ఇలాంటి భరించలేని విరహవేదనా మనసు భగవంతుని కోసం పరితపించేలా చేస్తుంది. ఈ భావంలో నిరంతరము భగవంతుని గుర్తుచేసుకోవడం, సాన్నిహిత్యాన్ని కోరుకోవడం జరుగుతుంది.
          ఒక్కొక్కసారి ఈ విరహవేదనే తారస్థాయిలో ఉన్నపుడు, మనసంతా విరహభావనతో నిండి,  ఆ పరమాత్మపైనే ఉండడం వల్ల ఆయన ప్రక్కనే ఉన్నా గుర్తించలేక పోవడం జరుగుతుంది. ఉ కృష్ణుని పట్టపురాణులు నదిలో జలక్రీడలాడుచుండగా ఈ విధమైన విరహాసక్తికి లోనౌతారు.
          ఈ విధంగా భక్తి ఒక్కటే అయినా వివిధ మార్గాలద్వారా ఏ రకంగా పొందవచ్చునో తెలుసుకున్నాము. భక్తులు వారి, వారి స్వభావరీత్యా భక్తిని వ్యక్తపరుస్తూ ఉండడం వలన, అది అందరిలో ఒకే రీతిన ఉండదు. సాధకులను అతి శ్రేష్టమైన భక్తిస్థితికి చేర్చే ఈ పదకొండు భక్తి మార్గాలను నారదులవారు ఇక్కడ మనకు సూచించడమైనది.    భక్తివల్ల పరమాత్మయందు ప్రేమ కలిగి మనకు శాంతి, పరమానందం సంప్రాప్తిస్తాయి. భక్తి జ్ఞాన మార్గాలు రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. జ్జానం ప్రాప్తించగానే ఎక్కడైనా పరమాత్మను చూడగలిగే స్థాయికి వస్తాడు సాధకుడు.
          పైన చెప్పిన సూత్రాలను విన్నవారు భక్తే మీ మతమా?” అని ప్రశ్నించగా అటువంటి ప్రజాభిప్రాయాలకు భయపడకుండా ముక్తి సాధనకు భక్తి మార్గమే శ్రేష్ఠమని ముక్త కంఠంతో చెప్పిన గురువులను గూర్చి తదుపరి సూత్రంలో చెప్పడం జరిగినది.
83వ సూత్రం:- ఇత్యేవం వదంతి జనజల్ప నిర్భయా, ఏకమతాం కుమార, వ్యాస, శుక, శాండిల్య, గర్గ, విష్ణు, కౌండిన్య, శేశ, ఉద్ధవ, ఆరుణి, బలి, హనుమత్, విభీషణాదయః భక్త్యాచార్యాః
          సనత్కుమారుడు, వ్యాసుడు, శుకుడు, శాండిల్యుడు, గర్గుడు, విష్ణువు, కౌండిన్యుడు, శేశుడు, ఉద్ధవుడు, ఆరుణి, బలి, హనుమంతుడు, విభీషణుడు మొదలైన అగ్రగణ్యులైన ఆచార్యులందరూ, లోకుల వ్యర్ధసంభాషణలను పట్టించుకోక, ఏకాభిప్రాయంతో భక్తి మార్గాన్ని ప్రబోధించారు.
          భక్తిమార్గాన్ని అవలంబించి, ప్రబోధించిన వీరందరికి భక్తి మార్గపు శ్రేష్ఠత, సత్ఫలితాన్నిచ్చే శక్తి విషయంపై గట్టి నమ్మకం ఉందని నారదులవారు ఈ సూత్రం ద్వారా తెలియచేస్తున్నారు. వివేకవంతునికి తన అభిప్రాయాల పట్ల ధృడమైన అభిప్రాయం ఉండడం వల్ల లోకులకు భయపడక దైర్యంగా, నిష్కపటంగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తాడు.
బ్రహ్మ తనయులైన సనత్కుమారులు (నారదుని గురువు) నిరంతరం ఆత్మానుభూతిలో లీనమై హరిశరణం అనే మంత్రాన్ని నిత్యం స్మరిస్తూ ఉంటారు.
          వ్యాస మహర్షి (నారదుని శిష్యుడు) పురాణాలను (భాగవతం మొదలైనవి) రచించిన గ్రంథకర్తగా మనందరికీ సుపరిచితులే. శుకుడు భాగవతాన్ని బోధించాడు. గొప్ప మహర్షియైన శాండిల్యుడు శాండిల్య భక్తి సూత్రాలు (శాండిల్య మీమాంస) రచించారు.  గర్గుడు కూడా  భక్తి సూత్రాలను రచించారు. కృష్ణునికి నామకరణం చేసింది కూడా ఈయనే. గర్గ సంహితను కూడా వ్రాశారు. విష్ణు మహర్షి కొన్ని స్మృతులను రచించారు.
          శాండిల్యుని పుత్రుడైన కౌండిన్య మహర్షి భక్తితో భగవంతునిలో లీనమవడాన్ని గురించి వివరించారు. ప్రగాఢమైన భక్తి సాధనకు అవసరమైన ధ్యాన మార్గాన్ని ఆయన తెలియజేసారు.
          మహాభక్తుడైన శేషుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే తన అంకం మీద శయనింప చేసుకున్న ఘనుడు. సంకర్షణునిగా, బలరామునిగా, లక్ష్మణునిగా, అనంతునిగా ఈయన అవతారాలు అనేకం.
          ఉద్ధవుడు శ్రీకృష్ణుని స్నేహితుడు, శిష్యుడు కూడా. తన సర్వస్వాన్ని భగవంతునికి అర్పించిన బలి చక్రవర్తి నూరు యాగాలు చేసి ఇంద్ర పదవిని అలంకరించాడు. సేవా భావంతో (దాస్యభక్తి) కూడిన భక్తిలో హనుమకు సాటి ఎవరూ లేరు.
          రావణుని తమ్ముడైన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరాముని ఆశ్రయించినప్పుడు (శరణాగతి తత్వం), ధర్మాన్ని పాటించడం వల్ల, రాక్షసుడైనా సాత్వికభావం కలిగి ఉండడం వల్ల శ్రీరాముని సాన్నిధ్యాన్ని పొందగలిగాడు.
          ఆద్యంతములులేని ఈ భక్తి మార్గ పరంపరలోని ఆచార్యులందరూ భక్తి స్వరూపం ఒక్కటే అని ముక్త కంఠంతో వచించారు.
          తదుపరి సూత్రంలో నారదులవారు భక్తిమార్గంలో ఎలా పరమాత్మని చేరాలి? అనేది వివరించారు.

No comments:

Post a Comment