Friday 7 March 2014

Sutra: 61 & 62


61వ సూత్రం:- లోకహానౌ, చిన్తాన కార్యా, నివేదిత ఆత్మలోకవేదశీలత్వాత్
నిజమైన భక్తుడు తన లౌకిక (లోక), అలౌకిక (వేద) గుణాల్ని (శీల), తన్ను తాను (ఆత్మ) సంపూర్ణంగా భగవంతునికి సమర్పిస్తాడు. కనుక లౌకిక విషయాలవల్ల కలిగే కష్టనష్టాలకు చింతించడు. నివేదన అంటే స్మరణ చేయ్యాలి.
          పరమాత్మకు దాసుడిగా ఉండి, కర్మలను చేయడం వల్ల చింతలకి లోను కావు, భయపడవు. ఎవరి గురించి ఐనా నా అనే భావన మనసులో కలిగినప్పుడు, ఇక అబేధం ఉండదు. మనలో పర అనుకుంటేనే భేదభావం వస్తుంది.
          దేనికీ చింతించక, ఎప్పుడు నవ్వుతూ ఉండడం వలన ఎంతటి దుఃఖమైనా మన దరి చేరలేక, తన అసమర్థతకు సిగ్గుపడి దూరంగా పారిపోతుంది. ఇదంతా పరమాత్మ మాయా ప్రభావం వల్లనే అని గ్రహించి, అప్పుడు కూడా పరమాత్మ నాకు తోడుగా ఉన్నాడన్న భావన మనలో కలగడం. ఇదే నిజమైన భక్తుని వైఖరి.
          అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగినా అవి భక్తిమార్గానికి ఏ మాత్రం అడ్డుగోడలు కావని, ఇది సులువుగా అనుసరించదగినదని, కర్తవ్య పాలన చేస్తూ ఉండాలని, నారదుల వారు ధైర్యంగా చెబుతున్నారు. దిగులు పడకుండా, పరమాత్మ ఒక్కడే సత్యమని నమ్మడం వల్ల, నిర్భీతితో ఉండాలి.
          పరమాత్మకు శరణాగతి చెందడం అంటే
1) ఆయన నన్ను ఎలా ఉంచదలచుకున్నారో అలాగే ఉంటాను అనుకోవడం,
2) పరమాత్మ నా పట్ల ఏ పని చేసినా, నేను ఆనందంగా ఉంటాను అనుకోవడం,
3) ఆయన్నే నేను నమ్మేను కనుక, నాకు ఏది సరియైన దనుకుంటే దానినే నాకు ప్రాప్తింపజేస్తాడు కనుక (సుఖమైనా, దుఃఖమైన), అదే నాకు సరియైనదని నమ్మడం. ఇంక ఏదీ అడగము, ఏది ఇచ్చినా స్వీకరించడమే.
          కాని ఇదంతా అనుభవపూర్వకంగా రాని సాధకునకు ఇవన్నీ మనసుకు సంబంధించినవేగాని, దాని దుఃఖాలు తనవి కావని, తను వాటిని గురించి తెలిసినవాడు మాత్రమే అని, కనుక అవి ఎప్పటికి తనవి కాజాలవని, తనను కదిలించలేవని తెలియదు. జ్ఞానికే ఈ విధంగా తెలుస్తుంది.

భక్తుడు తనను తాను పరిపూర్ణంగా, ఒక పువ్వులాగ భగవంతుని పాదాల చెంత సమర్పణ చేసుకోవడం వల్ల ఇది సులభమవుతుంది. అతని ఆలోచనలూ, లౌకిక కర్మలు, ధార్మిక, ఆధ్యాత్మిక సంబంధ కర్తవ్యాలు అన్నీ అర్పించేశాడు కనుక ఏ కష్టమొచ్చినా భారం భగవంతుని పైనే వేస్తాడు. ఇంక చింత లేదు. అతడు సుఖ, దుఃఖాలకు సాక్షి మాత్రమే. భక్తుని వైఖరి ఈ విధంగా ఉంటుంది (ఇదే నివేదిత- అత్మ లోక వేద శీల అంటే). భక్తుడు ఇలా వస్తు, విషయాల పట్ల వైరాగ్య భావం, సమర్పణ భావంలో సుఖాన్ని అలవరచుకుంటాడు. అర్పించడమే ప్రేమను వ్యక్తీకరించే విధానం. తనను, సర్వస్వాన్ని అర్పించడమే అసలైన త్యాగం. ఆ త్యాగం వల్లనే ఆనందం కలుగుతుంది. ఒక సారి ప్రేమతో ఇచ్చిన దేనినైన వెనక్కి తీసుకోలేము.
          ఇలా సదా మెలుకువలో ఉంటూ భక్తుడు తన శక్తిని వృధా చేయక, జీవిత విషయాల పట్ల ఆసక్తిని కనబరచక, అన్నీ పరమాత్మకు సమర్పించడం వల్ల స్వేచ్ఛగా, హాయిగా ఉంటూ ప్రశాంతతను అనుభవిస్తూ ఉంటాడు.
          రామానుజాచార్యులు శరణాగతికి షడ్విధ లక్షణాలుచెప్పారు. అవి 1) ఆనుకూలస్య సంకల్పః, 2) ప్రాతికూలస్య వర్జనం, 3) రక్షిస్యతీతి విశ్వాసః, 4) గోతృత్వే వరణం తథా, 5) ఆత్మ నిక్షేప (ఆత్మ నివేదనం), 6) కార్పణ్యం (దీన భావం)
          దేనిపై నాకు అహంకారం ఉందో, దానితో పరమాత్మకి సేవ చేయడం ద్వారా  అది పోతుంది. పరమాత్మను విస్మరించడం వల్లే దుఃఖం.
          భక్తి, చింత రెండు ఒకేచోట ఉండలేవు. పరమాత్మ ప్రేమ అందరిపై సమానంగా అద్వితీయంగా ఉంటుంది. బుద్ధి దృఢంగా ఉండి, నీవే కావాలనిపిస్తే, మనసు కూడా కావాలని పరితపిస్తుంది. పరమాత్మను గూర్చి మనమందరం చేసే సాధారణమైన తప్పు ఏమిటంటే ఏదో ఒకటే, బుద్ధి కాని మనసుని మాత్రమే సమర్పించడం. భక్తుడు మనసు మాత్రమే ఇస్తాడు. ఇదే మన దుర్భలత. మనసులో కలిగే సంకల్పాలు కూడా ఆయనకే సమర్పించాలి. మనసు, బుద్ధి రెండింటినీ సమన్వయపరచుకుని, రెండింటిని సమర్పించాలి. అన్నింటిని పాక్షికంగా ఇవ్వడం వల్లనే సమస్యలు, దుఃఖం. అన్నింటినీ  పరిపూర్ణంగా సమర్పించడం వల్ల నేను, నాది అంటూ ఏదీ మిగలదు.
62 వ సూత్రం:- నత (ద) త్సిద్ధౌ లోకవ్యవహారోన హేయః కింతు ఫలత్యాగః తత్సాధనంచ, కార్యమేవ
          భగవంతుని మీద పరిపూర్ణభక్తి, నిశ్చింత సిద్ధించేవరకు, తరువాత కూడా సామాజిక కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఫలాన్ని వదిలివేయాలి. (ఫలత్యాగః) నిష్కామంగా కర్మలను చేయాలి. నా ధర్మాన్ని నేను నిర్వర్తించడమే ప్రస్తుత కర్తవ్యంగా భావించి కర్మలను చేయడం వల్ల పరమాత్మ తప్పక లభిస్తాడు.
          లోక వ్యవహారాలు చేస్తూ ఫలితం ఏదైనా స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలి. లోక వ్యవహారాలు అంటే సమాజం పట్ల, దేశం పట్ల, ఇంటిలో తన బాధ్యతలను గుర్తెరిగి వాటిని చక్కగా నిర్వర్తించాలి. పరమాత్మ ఇచ్చిన ఈ క్షేత్రం (దేహం) ద్వారా నిష్కామంగా కర్మలను చేస్తూ, తన వాసనల నుండి బయటపడి, వాటిని పూర్తిగా నశింపచేసుకోవాలి. కర్తృత్వభావం వదల్లేకపోయినా కనీసం పరమాత్మ కోసమే చేస్తున్నాను అనే భావనతో చేయాలి. తన కష్టసుఖాలను, లాభనష్టాలను, జయాపజయాలనన్నింటినీ అర్పించిన భక్తునికి ఇక చింత అనేదే ఉండదు.
          కనుక సాధకుడు భక్తి, జ్ఞాన మార్గాలు రెండింటినీ సమన్వయ పరచుకుంటూ సాధనలో ముందుకు సాగాలి. తనకు ఏ స్థితి కల్పించినా, అది భగవంతుని కృపే అని స్వీకరించగలగాలి. ఏ పని అయినా గురువుకు, పరమాత్మకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఒక ప్రత్యేక-మైన పనికోసం కాని, ఫలితం కోసం కాని పట్టుపట్టకూడదు. త్యాగమే ప్రేమకు అసలైన కొలమానం. తరువాత స్థాయిలో అప్పుడు సాధకునకు సుగుణాలు అలవడతాయి.
సుగుణాలవలన చింత తొలగి చివరికి మోక్షం కూడా వద్దని, నిరంతరం ఆ పరమాత్మ నామస్మరణ, సేవ చేసుకోవడమే కావాలి అనుకుంటాడు. మనం కర్మలను చేస్తున్నకొద్దీ, అంతా భగవంతుని స్వరూపమేనని అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మనం చేసే ప్రతీ కర్మ భగవంతుని పూజగా అవగతమౌతుంది.
          సంపదలకు, సుఖాలకు దూరమౌతున్న కొద్దీ, పరమాత్మకు దగ్గరవుతూ ఉంటాడు. భక్తి విస్తృతమై, సాధన పటిష్టమౌతుంది. నిత్యం పూజ, జపాన్ని కొనసాగిస్తూ, పరమాత్మ తనకు నిర్దేశించిన కార్యరంగాన్ని గుర్తించి, అది తన అభ్యున్నతికి తోడ్పడగలదని గ్రహిస్తాడు. నిరంతర భగవన్నామ స్మరణ వల్ల సంసార చక్రంలో ఉన్నప్పటికీ హాయిగా ఉంటూ దానినుండి బయటపడాలని ఎదురుచూస్తూ ఉంటాడు.
          నిర్మల భక్తిని సాధించేవరకు, నిష్కామంగా కర్మలను చేస్తూ ఉండాలి. ప్రాపంచిక కర్మలలో నిమగ్నమై, ఆధ్యాత్మికాభ్యాసాన్ని విస్మరిస్తే, మాయ మనల్ని కప్పివేస్తుంది, లేదా ఆధ్యాత్మికానుభవం బలహీనపడుతుంది. గుణాలవల్ల కలిగే మాయని అతిక్రమించడం సాధ్యం కాదు. భగవంతుని శరణు పొందిన వారికే అది సాధ్యం. శరీరం ఉన్నంతసేపు జ్ఞాని కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు లేదా మాయ ప్రభావం అతన్నీ వదలదు.
          తత్సిద్ధౌ రెండవ అర్థంలో: ఉపనిషత్తులలో చెప్పిన విషయాలు కొన్నిసార్లు సాధకుని బుద్ధికి స్పష్టంగా, సమగ్రంగా గ్రాహ్యం కాకపోవడం వల్ల, గందరగోళం ఏర్పడుతుంది. ఉపనిషత్తులు నిర్దేశించిన జీవన విధానాన్ని గురువు నిలకడగా, శ్రద్ధగా అనుసరిస్తే, శిష్యులకు గురువు వల్ల ఈ విషయంలో చక్కని స్ఫూర్తి కలుగుతుంది.
          చిత్తంలో కలిగే సంకల్ప వికల్పాలు, అహంకారం, కర్తృత్వం అన్నీ ఆ పరమాత్మకే సమర్పించడం వల్ల శాంతి, పరమానందం లభిస్తాయి.
          సాధకుడు పరమాత్మ కోసమే కర్మలుచేస్తూ, లోక విషయాలను ప్రోత్సహించకుండా, అలా ప్రోత్సహించేవారికి దూరంగా ఉంటూ, ఎటువంటి కర్మలను చేయాలి (నిష్కామకర్మలు), ఎలా చేయాలి (కర్తృత్వ భావం వదలి). ఎటువంటివి  ఆచరించరాదో తెలుసుకొని చేయాలి. సాధకునికి ఫలత్యాగం సాధనలో భాగమయితే, సిద్ధునకు స్వభావతః వచ్చేది.

No comments:

Post a Comment