Friday 14 March 2014

Sutras : 63, 64 & 65



63 వ సూత్రం:- స్త్రీధన, నాస్తిక వైరి చరిత్రం న శ్రవణీయమ్
మన మనసుని ప్రభావితం చేసే స్త్రీల, ధనసంపదల, నాస్తికుల, శత్రువులను గూర్చిన వర్ణనలను వినరాదు.
          సాధకుడు తనకు అనవసరమైన విషయాలవైపు తన మనసు మళ్ళకుండా జాగ్రత్త పడాలి. ఈ ప్రపంచంలో ఉన్న మనకు ఇంద్రియాల ద్వారా వివిధ అనుభూతులు (శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధ) కలుగుతాయి. అవి మనల్ని అలజడికి గురిచేయకుండా ఉండాలంటే, జాగ్రత్తపడాలని నారదులవారు హితవు చెపుతున్నారు.
          అందుకే హృదయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, చెత్త నిండకుండా చూసుకోవాలి. ఎంత గొప్ప సాధకుడైనా, మనసు ఎంత గట్టిదైనా చెవుల ద్వారా మురికి (చెడువిషయాలు) మనసులో ప్రవేశిస్తే కామం, క్రోధం, లోభం మొదలైన భావాలు కలుగుతాయి. అటువంటి సందర్భాలలో మనసును భగవంతుని వైపు మళ్ళించడం ద్వారా మిగతావేమీ మనపై ప్రభావాన్ని చూపవు.
          ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ అనే తైలం మన మనసులో మెదులుతూ ఉండడం వల్ల మనసుకు ఏవీ అంటుకోవు. సంసారంలో అంటీముట్టనట్లుగా, తామరాకు మీది నీటిబొట్టులా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండడానికి నిరంతర భగవన్నామ జపమే శరణ్యం.
64 వ సూత్రం:-  అభిమాన దంభాదికం త్యాజ్యమ్
          సాధకుడు భక్తి మార్గంలో ఎదగడానికి గర్వం, ఆడంబరం వంటి అరిషడ్వర్గాన్ని (కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యం) వదిలివేయాలి. ఎవరంతట వారు హృదయాన్ని విశ్లేషించుకోవడం ద్వారా వీటిని తొలగించుకోవాలి. అభిమానం ఉన్న చోట పరమాత్మ ఉండడు. ఏ రంగంలో నైనా మన కన్నా ఉన్నతమైన వారితో (చదువు, సంస్కారం, అందం, సుగుణాలు మొవి) పోల్చుకోవడం ద్వారా నేను చాల తక్కువ అని తెలుస్తుంది.
          ఇటువంటి అహంకారం, దంభం మొదలైనవి పరిచ్ఛిన్నభావాలు. పరమాత్మ కంటే ఇవి వేరైనవి. వీటి పరిధి సీమితమైనది. ఇలాంటి భావాల వలన పరమాత్మకు దూరమౌతాము. అందువలన ఇలాంటి భావాలని మననుండి దూరం చేయాలి.
          గర్వం, ఆడంబరం, అహంభావం అన్నీ అహంకారానికి చెందిన నీచ లక్షణాలు కనుక వీటిని తప్పనిసరిగా త్యజించాలి. ఈ చెడు లక్షణాలు మన మనోబలాన్ని తగ్గించి, మనసులో అలజడులను సృష్టిస్తాయి.
          భక్తిలో మనకు సంప్రాప్తించినదంతా పరమాత్మ కృపగానే భావిస్తాము. జ్ఞానంలో అలా కాదు. కాని ఫలితం రెండింటిలోను ఒక్కటే. సర్వవ్యాపకమైన ఆ పరమాత్మ నుండి ఎవ్వరమూ తప్పించుకోలేము. కనుక అభిమానం, దంభం, కపటం మొదలైనవన్నీ మనలోనుండి తొలగిపోవాలని ఆయనను ప్రార్థించాలి.
          మనలో ఉన్న సుగుణాలన్నీ హృదయంలో (మనకు ముందువైపున) ఉంటాయి. అందువలనే మనకు ఎప్పుడూ మనలో ఉన్న దుర్గుణాలు కనబడకపోగా, ఎదుటివారి దుర్గుణాలు మాత్రమే కనిపిస్తాయి. అందుకే మనల్ని మనము విశ్లేషించుకోవడం ద్వారా మాత్రమే, మనకు తెలియనది (మన గురించి) చాల ఉందని తెలుస్తుంది.
          కాబట్టే తరువాతి సూత్రంలో పైన తెల్పిన చెడు లక్షణాలను ఎలా వదిలివేయాలో తెలుసుకుంటున్నాము.
65 వ సూత్రం:- తదర్పిత అభిలాచారః సన్, కామక్రోధాభిమానాదికం, తస్మిన్నేవ కరణీయమ్
          మనలో ఉన్న చెడు లక్షణాలన్నింటినీ పరమాత్మకు అర్పణ చేయడం ద్వారా మాత్రమే వాటిని వదిలి వేయగలుగుతాము.
          చెడు లక్షణాలన్నిటినీ వదిలించుకున్న తర్వాత, భక్తిని ఎలా పెంపొందిం-చుకోవాలో నారదులు చెబుతున్నారు. సాధకుడు తన ప్రతీ ఆలోచనా, పలుకు, కర్మలు అన్నీ పరమాత్మకే సమర్పించుకోవడమే కాక, ఆ పరమాత్మను తన జీవితానికి కేంద్ర బిందువుగా చేసుకోవాలి.
          భిన్నంతో తాదాత్మ్యం చెందితే ఎప్పుడూ దుఃఖమే. నిజమైన భక్తుడు తన సర్వస్వాన్ని భగవంతుని పాదాల చెంత అర్పించి, కర్మలను ఆచరిస్తాడు. కాని ఆ కర్మల ద్వారా తన కోర్కెలను తీర్చుకోవాలని అనుకోడు. సర్వదా పరమాత్మ సంబంధమైన అన్ని కార్యాలలో తానొక పరికరంగా  వినియోగింపబడాలని మాత్రమే కోరుకుంటాడు.
          అరిషడ్వర్గాన్ని త్యజించాలని చెప్పినప్పటికీ, నిజానికి అవి లేకుండా మనసు ఉండదు. మనసే లేకపోతే భక్తి కూడా లేదు. భక్తిని అభ్యసించడానికి మనసు ఉండాలి. మళ్ళీ మనసుతో పాటే ఈ అరిషడ్వర్గం ఉండడం వల్ల మనసు ప్రశాంతత కోల్పోయి, అలజడికి లోనవుతుంది. అందుకే మనసును ముందు ఉపశమింపచేసుకోవాలి. దానికి మనసును పరమాత్మ వైపు మళ్ళించడం ఒకటే మార్గం. ఇలా చెయ్యడం వల్ల సాధకుడు ఆధ్యాత్మిక పురోగతిని సాధించడానికి వీలవుతుంది.
          ధర్మాచరణ విషయంలో లోభిగా ఉంటూ, పరమాత్మవైపు మనసును మళ్ళించే విషయంలో అత్యాశాపరుడిగా ఉంటూ భక్తిని పెంపొందించుకోవాలి. మనలో ఉన్న దుర్గుణాలని మనకు అనువుగా మార్చుకోగలిగే విధానం ఇదే.                 (సశేషం)
(జూన్ నెల తరువాయి భాగం)
(65వ సూత్రం: -) మనసే మనకు ప్రధాన శత్రువు. మనం లౌకిక వ్యవహారాలన్నింటినీ ఈ దేహం, మనస్సు, బుద్ధి ఉండడం ద్వారా మాత్రమే చేయగలుగుతున్నాము. కాబట్టి మనస్సును విడిచిపెట్టి పనిచేయడమన్నది అసాధ్యం. అందువలన మనసులో కలిగే ఆలోచనలు, భావాలన్నింటినీ పరమాత్మవైపు మళ్ళించి, ఆయనకే సమర్పించడం ద్వారా, ఆయనపైనే ప్రయోగించడం ద్వారా మాత్రమే మనసును మనకు సహకరించేటట్లు చేసుకోవచ్చు.
          ఒక సాధకుడిగా ఏ పనైనా ఎందుకోసం చేస్తున్నాను? అని ప్రశ్నించుకున్నప్పుడు, సమాధానం నాకోసమే అయితే, అది అర్పణ ఎలా అవుతుంది? మన మనసులో కలిగే భావనే మన పనిలో వ్యక్తమౌతుంది. అదే పనిని పరమాత్మ కోసమే అనే భావనతో చేసినప్పుడు, పరిపూర్ణమైన అంకితభావం (అర్పణ) తో, ప్రేమతో చేయడం వలన ఆ పని ఏదైనా చక్కగా జరుగుతుంది.
          చెడు ఎప్పుడూ బలంగా ఉంటుంది. మనకు దుఃఖాన్ని కలిగించే దానిని మరచి, నిత్యసుఖాన్నిచ్చే (ఈశ్వరుని) దానిని గుర్తెరిగి, దాని కోసం ప్రాకులాడాలి.
          నా మదిలో భావాలు, అవగుణాలు అన్నీ ఆ పరమాత్మ ప్రేరణ వల్లే కలుగుతున్నాయి. కాబట్టి, నేను ఆయన ఆడిస్తున్న ఒక బొమ్మను మాత్రమే! అని తెలుసుకోగలగాలి. అన్నీ (మంచి, చెడు) ఆయనకే పూర్ణంగా అర్పించడం ద్వారా మనసు తేలికపడి, మన పని సులువవుతుంది. అన్నింటినీ ఆయన తప్పక స్వీకరిస్తాడు. దీనిలో మనకు పోయేదేమి ఉండదు.
          ఈ అరిషడ్వర్గాన్ని జయించడానికి ఇదే అత్యుత్తమ మార్గమని నారదుల వారు చెపుతున్నారు.

No comments:

Post a Comment